సీపీఐ ప్రజా పోరుయాత్ర -టీఆర్ఎస్ మీటింగ్ వాయిదా

 హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో సీపీఐ ఇక చురుకైనా పాత్రను పోషించనున్నది. పోరుయాత్రతో తెలంగాణ పల్లెల్లో ఎర్రజెండా రెపరెపలాడనున్నది. ప్రజల్లో చైతన్యం కలిగించి, తెలంగాణ పోరాటంలో నూతన అధ్యాయానికి శనివారం నాటి నుంచి వచ్చే నెల 3వరకు 10రోజుల పాటు సీపీఐ ప్రజా పోరుయాత్రను ప్రారంభించబోతోంది. ఇదిలా ఉంటే, శుక్రవారం నుంచి ప్రారంభం కావల్సిన టీఆర్ఎస్ ఉద్యమ కార్యచరణ సమావేశాలు వాయిదా పడ్డాయి.  సీపీఐ తలపెట్టిన ప్రజాపోరుయాత్రలో తెలంగాణ రాజకీయ జేఏసీ కూడా పాలుపంచుకోనున్నది. తెలంగాణ ఉద్యమాన్ని గడప గడపకు తీసుకెళ్లడానికి గానూ సీపీఐ తలపెట్టిన పోరుయాత్రను ఖమ్మం జిల్లా పాల్వంచలో సీపీఐ కార్యదర్శి నారాయణ ప్రారంభిస్తారు. 10రోజుల పాటు జరిగే సీపీఐ పోరుయాత్ర తెలంగాణలోని 10జిల్లాల్లో కొనసాగుతుంది. సెప్టెంబర్ 3న వరంగల్ జిల్లాలో తెలంగాణ పోరుయాత్ర ముగియనున్నది. ప్రతి జిల్లాలో పర్యటించే సీపీఐ తెలంగాణపై ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను, కుతంత్రాలను ప్రజలకు వివరించడంతో పాటు, తెలంగాణ గురించి సీపీఐ కట్టుబడి ఉన్న విషయాన్ని గుర్తు చేయనున్నది. తెలంగాణ కోసం సీపీఐ రాజీలేని పోరాటాన్ని చేస్తున్నట్లు ఈ పోరుయాత్ర ద్వారా ప్రజలకు చెప్పనున్నది. ఇదిలా ఉంటే, తెలంగాణ రాష్ర్టం ఏర్పాటే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ర్ట సమితి శుక్రవారం నాడు నిర్వహించాలనుకున్న మీటింగ్ను వాయిదా వేసుకుంది. తెలంగాణ ఏర్పాటుపై కేంద్రం నుంచి తనకు సిగ్నల్స్ వచ్చాయనీ కేసీఆర్ చెప్పుకుంటూ వచ్చారు. ఈ నెల 20దాకా కేంద్రానికి కేసీఆర్ గడువు పెట్టారు. గడువు ముగిసింది. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీనితో ఉద్యమ భవిష్యత్ కార్యచరణను రూపొందించడానికి గానూ ఈ నెల 24, 25,26తేదీలలో మూడు రోజుల పాటు పొలిట్ బ్యూరో సమావేశాలు ఉంటాయనీ ముందుగానే ప్రకటించింది టీఆర్ఎస్. ఏమైందో ఏమో కానీ, టీఆర్ఎస్ భవిష్యత్ కార్యచరణ సమావేశాలు వాయిదాపడ్డాయి. తెలంగాణపై తమకే సర్వహక్కులున్నాయంటూ చెప్పుకుంటూ వస్తున్న టీఆర్ఎస్ ఎప్పటికప్పుడు తన కార్యచరణను వాయిదా వేసుకోవడమో, రద్దు చేసుకోవడమో జరుగుతుంది.  సీపీఐ పార్టీ పోరుయాత్రతో తెలంగాణ జిల్లాలో దూసుకుపోతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేత కేసీఆర్, ఆ పార్టీ నేతలు కొంత మౌనంగా ఉండటం పట్ల తెలంగాణవాదుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: